ఏపీ ప్రభుత్వం క్రీడా పాలసీని సిద్దం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఇప్పటి వరకు ఉన్న 2 శాతం రిజర్వేషన్లను 3 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో రాణించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను భారీగా పెంచారు.
ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు రూ.7కోట్లు, రజతం గెలుచుకున్న వారికి రూ.5 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.3 కోట్ల ప్రోత్సాహక నగదు ఇవ్వాలని నిర్ణయించారు.ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడుకి రూ.50 లక్షలు అందించనున్నారు. ఇక ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలను పెంచారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రతజం గెలుచుకుంటే రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.కోటి ప్రోత్సాహకం అందిస్తారు.
క్రీడాకారులకు ప్రభుత్వ యూనిఫాం సర్వీసుల్లో 3 శాతం ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలని సీఎం ఆదేశించారు. జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధిస్తే రూ.5, కాంస్యం గెలుచుకుంటే రూ.3 లక్షలు అందిస్తారు. ఒలింపిక్స్ పతక విజేతలకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి రాజధానిలో క్రీడా గ్రామం ఏర్పాటు చేయడంతోపాటు, తిరుపతి, విశాఖపట్నంలో క్రీడా కాంప్లెక్సులు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, కడప, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజనుల కోసం విజయనగరంలో ప్రత్యేక క్రీడా పాఠశాల నెలకొల్పనున్నారు.