బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత గురువారం రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. తాజాగా సోమవారం నాడు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 1300 తగ్గి రూ.81100కు దిగివచ్చినట్లు సఫారా అసోసియేషన్ వెల్లడించింది. గురువారంనాడు బంగారం గరిష్ఠంగా రూ.82400 పలికింది. కిలో వెండి గురువారం నాటికి లక్ష దాటగా సోమవారం ఒకే రోజు రూ.4500 తగ్గి రూ.95 వేలకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర దిగివచ్చింది. ఔన్సు బంగారం 2740 అమెరికా డాలర్లు తగ్గింది.
బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా గతవారంలో పెరగడంతో కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండు తగ్గడంతో బంగారం, వెండి ధరలు దిగివచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశముందనే ముందస్తు అంచనాలు వెలువడుతున్నాయి. చైనాలోనూ మరోసారి ఉద్దీపన ప్యాకేజీ వస్తుందనే అంచనాలు కూడా స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయని అనలిస్టులు చెబుతున్నారు.
ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు 74 డాలర్లకు దిగివచ్చింది. రూపాయి విలువ దిగజారింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 84.25కు తగ్గింది. బంగారం, వెండి ధరలు రాబోయే వారంలో మరికొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.