తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబరు 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు, ఫలితాలను విడుదల చేస్తారు.
దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అయితే కేరళ, పంజాబ్, యూపీల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీ మార్చాలంటూ పలు పార్టీలు ఈసీని కోరాయి. పండగలు ఉండటంతో ఓటింగ్ తగ్గే ప్రమాద ముందని ఎన్నికల తేదీ మార్చాలని కోరడంతో తాజాగా షెడ్యూల్లో మార్పులు చేశారు. యూపీలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మిలిగిన స్థానాల్లో గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఈసీ ప్రకటించింది.