ఈ ఉదయం ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాద సంఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.1లక్ష చొప్పున రాష్ట్రప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ప్రమాదం జరిగిన బస్సు గఢ్వాల్ లోని పౌరీ నుంచి కుమావొన్ లోని రామ్‌నగర్ వెడుతోంది. సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉండే ఆ మార్గంలో ప్రయాణం రాత్రి మొదలుపెట్టింది. ఈ ఉదయం 8.25 గంటల సమయంలో రామ్‌నగర్‌కు 35 కిలోమీటర్లు ఉందనగా మార్చూలా అనే ప్రదేశం దగ్గర బస్సు లోయలో పడిపోయింది.
ముందుగా, ప్రమాద ప్రదేశానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. బాధితులను రక్షించే ప్రయత్నం చేసారు. కొద్దిసేపటికే పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టారు.
చాలామంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. 9మంది మాత్రం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఆర్థిక సహాయం, గాయపడినవారికి రూ.1లక్ష సహాయం అందజేస్తామని వెల్లడించారు.