అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ స్టాక్ సూచీలపై పడింది. అమెరికాలో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అవుతారనే అంచనాలు ఆసియా, ఐరోపా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 941 పాయింట్ల నష్టంతో 78782 వద్ద ముగిసింది. నిఫ్టీ 314 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో 23 రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎస్బీఐ, ఐసిఐసీఐ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి విలువ 84కు క్షీణించింది. ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ 74.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర 1759 డాలర్లకు దిగివచ్చింది.