కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో కనీసం 53 చారిత్రక ప్రాచీన కట్టడాలు తమవేనంటూ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. ఆ కట్టడాల్లో గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా, బారా కమాన్, బీదర్ కోట, కలబురగి కోట మొదలైనవి ఉన్నాయి.
వక్ఫ్ బోర్డ్ తమవని చెప్పుకుంటున్న 53 ప్రాచీన కట్టడాల్లో 43 విజయపురాలోనే ఉన్నాయి. విజయపురా ఒకప్పుడు ఆదిల్‌షాహీల రాజధాని. మిగతావాటిలో 6 హంపిలోను, 4 బెంగళూరు సర్కిల్లోనూ ఉన్నాయి.
కేంద్రప్రభుత్వ రక్షణలో ఉన్న 43 ప్రాచీన కట్టడాలు తమవేనంటూ విజయపురా వక్ఫ్ బోర్డ్ 2005లోనే ప్రకటించినట్లు తెలుస్తోంది. అప్పుడు కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ (వైద్యవిద్య) ముఖ్యకార్యదర్శిగా మహమ్మద్ మొహిసిన్ ఉండేవాడు. ఆయనే విజయపురా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు డిప్యూటీ కమిషనర్‌గానూ ఉండేవాడు. ఆ కట్టడాల గురించి సాధికార లిఖిత సాక్ష్యాలు సమర్పించిన తర్వాత రెవెన్యూ విభాగం ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని మొహిసిన్ చెప్పాడు.
ఆ ఆస్తుల యజమానికి ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్‌ను, హక్కుల రికార్డులను వక్ఫ్ బోర్డ్ తనకు అనుకూలంగా చూపించుకుంటోంది.
అయితే, ఒక ఆస్తి భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ – ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ)కి చెందినదైతే దాన్ని డీనోటిఫై చేయడం, మరొకరికి అందజేయడం అసాధ్యం. అలా చేయడం ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ రిమెయిన్స్ యాక్ట్ అండ్ రూల్స్ 1958 ప్రకారం పూర్తిగా నిషిద్ధం.
‘‘ఒక భూమి లేదా కట్టడం యాజమాన్యం ఎఎస్ఐ చేతిలో ఉండగా దానిపై అధికారం తమదని వక్ఫ్ చెబుతోంది. వక్ఫ్ బోర్డు ఆ నిర్మాణాల గురించి ఎఎస్ఐను సంప్రదించకుండానే తమ అధికారాన్ని ప్రకటించేసుకుంది’’ అని, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిసింది.
ఆ ప్రాచీన కట్టడాల గురించి 2012లో ఒక జాయింట్ సర్వే జరిగింది. ఆ సమయంలో, ఆ కట్టడాల మీద అధికారం తమది అని చెప్పడానికి వక్ఫ్ బోర్డ్ ఎలాంటి సాక్ష్యాలనూ సమర్పించలేదు. అయితే అప్పటికే వాటిలో 43 కట్టడాలను విజయపురా వక్ఫ్ బోర్డ్ చట్టవిరుద్ధంగా ఆక్రమించేసింది.
‘‘విజయపురాలోని 43 కట్టడాల రూపాలను మార్చేస్తున్నారు. ప్లాస్టర్, సిమెంట్లతో రిపేర్లు చేస్తున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, విద్యుద్దీపాలు, టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ చారిత్రక నిర్మాణాల్లో దుకాణదారులు తమ వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చే పర్యాటకులపై ఇలాంటి చర్యలు ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నాయి’’ అని ఎఎస్ఐ అధికారి ఒకరు వెల్లడించారు.
కేంద్రప్రభుత్వ రక్షిత కట్టడాల్లో దురాక్రమణలు 2007నుంచీ కొనసాగుతూన్నాయి. అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆనాటి కర్ణాటక ప్రధాన కార్యదర్శికి, విజయపురా డిప్యూటీ కమిషనర్‌కి, మైనారిటీ సంక్షేమ శాఖకూ అటువంటి దురాక్రమణల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసినా, అవి నేటికీ అమల్లోకి రానేలేదు.