కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రలో డీజీపీపై ఈసీ వేటు వేసింది. డీజీపీ అధికార పార్టీ ప్రతినిధిగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ రికార్డు చేసి, వాటిని డీజీపీ రష్మీ శుక్లా అధికార పార్టీ నేతలకు అందిస్తున్నారంటూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
డీజీపీ రష్మీ శుక్లా మహాయతి కూటమి, మహా వికాస్ అఘాడీ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారని శివసేన ( యూబీటీ ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణపై ఈసీ చర్యలు తీసుకుంది. డీజీపీపై వేటు వేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లు పంపించాలని ఈసీ ఆదేశించింది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించనుంది.
ప్రతిపక్ష కూటమి ఎంవీఏలోని పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. బీజేపీ డీజీపీగా రష్మీ శుక్లా పనిచేస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 20 ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు డీజీపీపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.