అమరావతి రాజధాని అవుటర్ రింగు రోడ్ పనుల్లో కదలిక మొదలైంది. డీపీఆర్ సిద్దం చేయాలంటూ కేంద్రం జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. 5 జిల్లాల పరిధిలో 189 కి.మీ మేర అవుటర్ రింగు రోడ్డు రానుంది. ఇందుకు 3 వేల హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అంచనా. 2018లోనే అలైన్మెంట్ రూపొందించారు. దాని ఆధారంగా డ్రోన్ల ద్వారా సర్వే చేస్తున్నారు. ఆర్వీ అసోషియేట్స్ సహకారం తీసుకుంటున్నారు.
భూ సేకరణకు అయ్యే ఖర్చు సహా మొత్తం రూ.25000కోట్లుపైగా కేంద్రం భరించేందుకు ముందుకు వచ్చింది. ఏడాదిలో డీపీఆర్ సిద్దం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ లోగా భూ సేకరణ పూర్తి చేయనున్నారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి కావడంతో పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములు సేకరించాల్సి ఉంది.
ఏడాదిలో డీపీఆర్ సిద్దం చేయడంతోపాటు, ఈ లోగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అవుటర్ రింగు రోడ్డు పూర్తి అయిన తరవాత ట్రాఫిక్ ఎంత ఉంటుందనే దానిపై పలు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. జాతీయ రహదారులు కలిసే ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ ఎంత ఉంటుంది, టోల్ గేట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా స్పష్టత రానుంది.
మరోవైపు అమరావతి ఇన్నర్రింగు రోడ్డు నిర్మించేందుకు అదానీ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ సిద్దమైంది. డీపీఆర్ తయారు చేయాల్సి ఉంది. భూసేకరణకు రూ.2700 కోట్లు అవసరం అవుతుందని అంచనా. 89 కి.మీ ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంటులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.