కార్తీక మాసం మొదటి సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబా మల్లికార్జునుల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడవీధిలోనూ కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీకమాసం ముగిసేవరకూ శని,ఆది,సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసారు. మంగళవారం నుండి శుక్రవారం వరకూ రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. నేడు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. నేటి సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని ముక్కంటీశ్వరునికి దీపారాధన చేస్తున్నారు. స్వర్ణముఖినదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఆలయంలో ధ్వజస్తంభం ఆవరణలో 365 ఒత్తుల దీపాలతో శివుణ్ణి పూజిస్తున్నారు. శివనామస్మరణతో శ్రీకాళహస్తి ఆలయం మారుమ్రోగుతోంది.
చిత్తూరు జిల్లాలోని వెయ్యి లింగాల కోన భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే భక్తులు వెయ్యిలింగాల కోనకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి దీపారాధన చేస్తున్నారు. జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శివాలయాల్లో క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి తీరం భక్తుల శివ నామస్మరణలతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే సిద్ధాంతం, ఆచంట, కోడేరు, దొడ్డిపట్ల, లక్ష్మిపాలెం, నరసాపురం గోదావరి పుణ్య స్నాన ఘట్టాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురంలో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించిన వ్యాఘ్రేశ్వరస్వామి ఆలయంలోను పాలకొల్లు, భీమవరం పంచారామ క్షేత్రాలలోనూ భక్తులు తెల్లవారుజామునుంచి పోటెత్తారు.
కోనసీమ జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. వేకువజామునుండి భక్తులు పరమశివుని దర్శనానికి బారులు తీరారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంతోపాటు కుండలేశ్వరం, క్షణముక్తీశ్వరం, శివకోటి, అమలాపురం, మందపల్లి, దేవగుప్తం, రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలతోపాటు ఏకాదశరుద్రుల దర్శనం ఇలా అనేక శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో కళకళలాడాయి. శివక్షేత్రాల దర్శనంతోపాటు భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
బాపట్ల జిల్లావ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు కార్తీకశోభతో అల్లరారుతున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారు జామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని రేపల్లె, చీరాల, బాపట్ల, అద్దంకి నియెజకవర్గాలలోని దేవాలయాలలో మహిళలు దేవతామూర్తులను దర్శించుకొని, కార్తీక దీపాలు వెలిగించారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృతాభిషేకం చేసారు.