విద్యుత్ షాక్ నలుగురి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతున్న యువకులకు విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు చనిపోయారు. సర్ధార్ పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షాక్‌నకు గురై
పామర్తి నాగేంద్ర, బొల్లా వీర్రాజు, మణికంఠ,కాసగాని కృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
సర్ధార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ విషయంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఇరువర్గాలను పిలిపించి సబ్ కలెక్టర్ సమస్యను పరిష్కరించారు.నటుడు సుమన్ చేతుల మీదుగా పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
బాధిత కుటుంబాలను మంత్రి దుర్గేష్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అనంతరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.