తాము అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. రాంచీలో భారీ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా, సంకల్ప్ పత్ర్ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
ఝార్ఖండ్‌లో సోరెన్ ప్రభుత్వం అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు.కొందరు అక్రమార్కులు ఝార్ఖండ్‌లో ప్రవేశించి ఇక్కడి మహిళలను వివాహం చేసుకుని భూములు కబ్జా చేస్తున్నారని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని షా దుయ్యబట్టారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా విడుదల చేసిన మ్యానిఫెస్టో ఆకట్టుకుంటోంది. ప్రతి మహిళకు నెలకు రూ.2100, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల ఉద్యోగాలు, ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకొస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
ఝార్ఖండ్‌లో అధికారం కోసం ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్, జైరాం మహతోతో జట్టుకట్టింది. బీజేపీ హిందుత్వను అస్త్రంగా వాడుతోంది. సోరెన్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఎండగడుతోంది. 81 సీట్లున్న అసెంబ్లీకి నవంబరు 13, 20 రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు.