రిషబ్ పంత్ వీరోచిత పోరాటం వృథా
వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజీలాండ్, భారత్ పై విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండింట్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న కివీస్, చివరిదైన వాంఖడే టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ చేసిన భారత్ కు గెలుపు దక్కలేదు.
రెండో ఇన్నింగ్స్లో భాగంగా 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పంత్ క్రీజులో నిలదొక్కుకొని వీరోచితంగా పోరాడాడు. వికెట్లు పడుతున్నా వెరవకుండా హాఫ్ సెంచరీ చేశాడు. కానీ 64 పరుగులు చేసి అతడు వెనుదిరగడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. 121 పరుగులకు భారత్ ఆలౌట్ కావడంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ మినహా ఏ ఒక్కరూ మెరుగ్గా ఆడలేదు. యశస్వీ జైస్వాల్ (5), రోహిత్ శర్మ(11), శుభమన్ గిల్ (1) ఘోరంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ఒక్కో పరుగు మాత్రమే చేశారు. రెండు ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో రాణించిన జడేజా , బ్యాటింగ్ లో విఫలం అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఆరుపరుగులు మాత్రమే చేశాడు. రవిచంద్రన్ అశ్వీన్ (8) ఆకాశ్ దీప్ (0), మహమ్మద్ సిరాజ్ (0*) నిరాశపరిచారు.
కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 6 వికెట్లు తీయగా, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మాట్ హెన్రీ ఓ వికెట్ తీశాడు.