విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తిక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు.
నేడు యమ ద్వితీయ సందర్భంగా శ్రీ దుర్గమ్మ వారికి గాజుల అలంకరణ చేశారు. ప్రతీ ఏటా యమ ద్వితీయ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అనవాయితీ. దాదాపు నాలుగు లక్షల గాజులతో అమ్మవారి మూలవిరాట్టుతో పాటు ఆలయ పరిసరాలను అలంకరించారు. ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు కూడా గాజుల అలంకరణలో పాల్గొన్నారు. రకరకాల గాజులతో అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ఉంది. ఉత్సవం ముగిసిన తర్వాత గాజులను భక్తులకు అందజేస్తారు.
కార్తిక శుద్ధ విదియ రోజును భగిని విదియ అంటారు. సోదరి తన సోదరుడు కోసం ఈ పండుగ చేసుకోవడం సనాతన ధర్మంలో సంప్రదాయం. ఈ రోజున సోదరుడు తన సోదరికి పసుపు, కుంకమ ఇచ్చి క్షేమంగా ఉండాలని ఆశీస్సులు అందిస్తారు. యమధర్మరాజు ఈ రోజున తన సోదరి అయిన యమునకి పసుపు, కుంకుమ పెట్టి ఆశీస్సులు అందించారు. ఇలా చేయడంతో సోదరి సుమంగళిగా ఉంటుందని నమ్మకం. భగీని హస్త భోజనం అంటే సోదరిచేతి వంట అని తెలుగులో అర్థం.