ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో వంద గజాలలోపు నిర్మించే ఇళ్లకు ప్లాన్ అవసరం లేకుండా చట్టాన్ని సవరిస్తామని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. విశాఖ నగరంలో జరుగుతోన్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఈ విషయం వెల్లడించారు. నగరాల్లో 100 నుంచి 300 గజాలలోపు ఇళ్లకు ప్లాన్ మంజూరును సులభతరం చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.
విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్, టిడ్కో గృహాల నిర్మాణాలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నగరంలో చేపట్టబోతోన్న పలు ప్రాజెక్టులపై విశాఖ కమిషనర్‌తో సమీక్షలు నిర్వహించారు. త్వరలోనే విశాఖలో 4 కారిడార్లలో మెట్రో పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
అమరావతి రాజధానిపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, మూడు సంవత్సరాల్లో భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అమరావతి ప్లాన్‌లో ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. ఒకటి రెండు భవనాల నిర్మాణాలు మినహా మిగిలినవి అన్నీ 36 మాసాల్లో పూర్తవుతాయన్నారు. రోడ్ల పనులు కూడా జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.