కేరళ ప్రభుత్వం, అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వచ్చే భక్తులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనుంది. నవంబర్ 16 నుంచి స్వామి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ రూ.5 లక్షల వరకు ఉచిత బీమా కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన బీమా ప్రీమియం సొమ్మును దేవస్థానం బోర్డు చెల్లించనుంది. ప్రమాదవశాత్తు లేదా మరేదైనా విపత్తు లేదా సహజ మరణం అయినా రూ.5 లక్షల బీమా సొమ్ము సంబంధిత కుటుంబానికి అందించాలని నిర్ణయించారు. అలాగే ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఉచితంగా స్వస్థలాలకు చేర్చాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
శబరిమలకు వచ్చే భక్తులందరికీ ఈ ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లాంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆలయ బోర్డు సూచించింది.