ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 9 వికెట్లు నష్టపోయి 179 పరుగులు సాధించింది. రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి క్రీజులో అజాజ్ పటేల్ , విలియమ్ ఓరోర్కీ ఉన్నారు. దీంతో భారత్ పై కివీస్ 143 పరుగులు ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235 పరుగుల లక్ష్యం విధించగా, భారత్ 263 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే కివీస్ కష్టాల్లో పడింది. ఆకాశ్ దీప్ వేసిన 0.5 బంతికి టామ్ లాథమ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండు పరుగులు వద్ద కివీస్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత డేవోన్ కాన్వే (22)ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. రచిన్ రవిచంద్ర నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి నాలుగు పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో 44 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. డేరిల్ మిచెల్ (21), రవీంద్ర జడేజా వేసిన 27.5 బంతిని రవిచంద్రన్ అశ్విన్ కు క్యాచ్ గా అందించి వెనుదిరిగాడు. టామ్ బ్లండల్(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. రవీంద్ర జడేజా బ్రిలియంట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (26) అశ్విన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. దీంతో స్కోర్ బోర్డు 131 వద్ద కివీస్ ఆరో వికెట్ నష్టపోయింది.
ఈష్ సోధి(8) జడేజా బౌలింగ్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. జడేజా వేసిన 37.5 బంతిని ఆడగా విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాతి ఓవర్ లో విల్ యంగ్ (51) వెనుదిరిగాడు.అశ్విన్ వేసిన బంతిని అతడికే క్యాచ్ గా అందించాడు. ఇక 9 వ వికెట్ గా మాట్ హెన్రీ (10) జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 43.3 ఓవర్లు ఆడి 9 వికెట్లు నష్టపోయి171 పరుగులు చేసింది.
జడేజా నాలుగు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 263 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (90), పంత్ (60), వాషింగ్టన్ సుందర్ (38), యశస్వీ జైస్వాల్ (30)రాణించారు. మహ్మద్ సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ(18), కోహ్లీ (4), జడేజా(14), అశ్విన్(6) విఫలం అయ్యారు.