మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఛత్రిపురా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీపావళి బాణాసంచా కాల్చుకోడాన్ని ముస్లిములు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. వాగ్వాదంగా ప్రారంభమై, హింసాత్మక ఘర్షణగా మారింది. ఇరుపక్షాలూ రాళ్ళు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు.
దీపావళి మరునాడు కొంతమంది పిల్లలు బాణాసంచా కాల్చుకుంటున్నారు. పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలు దానికి అడ్డుచెప్పాయి. దాంతో ఇరుపక్షాల మధ్యా వాదన మొదలైంది. ఎవరూ తగ్గకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెచ్చిపోయిన మతం వారు కోపావేశాలతో అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసారు, ఇళ్ళ కిటికీలు పగలగొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
పరిస్థితిని అదుపు చేయడానికి సుమారు 80 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండడంతో మల్హర్‌గంజ్, పంద్రినాథ్, సరాఫా తదితర సమీప పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారనీ, వారికి చికిత్స అందుతోందనీ డీసీపీ రిషీకేష్ మీనా చెప్పారు. సంఘటన గురించి తెలిసాక స్థానిక ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్, హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి ఛత్రిపురా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. దాడికి, హింసకు పాల్పడిన ఇతర మతస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
హర్యానాలోనూ ముస్లిముల అరాచకం:
ఇటువంటి సంఘటనే మరొకటి హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చుకుంటున్న హిందూ కుటుంబం మీద కొందరు ముస్లిములు మూకదాడికి పాల్పడ్డారు. రాజ్, ఆషిక్ అనే యువకులు ఆ దాడికి నేతృత్వం వహించారు. హిందూ కుటుంబంలోని అమ్మాయి మీద భౌతిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు.
దుర్గాప్రసాద్ అనే మైనర్ బాలుడు తమ ఇంటి బైట టపాసులు కాల్చుకుంటుంటే కొందరు యువకులు ఆ పిల్లాడితో గొడవ పడ్డారు. బాలుడి కుటుంబసభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ యువకులు రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ఆ హిందూ కుటుంబం మీద రాళ్ళు రువ్వారు, ఇటుకలు విసిరారు. ఆ హిందూ కుటుంబం భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటే ముస్లిముల మూక తలుపులు పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆ కుటుంబ సభ్యులను కర్రలతో చితగ్గొట్టారు. ఆ ఇంటి అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె శారీరకంగా గాయపడింది, మానసికంగా కుంగిపోయింది. ఆ ఘటనతో భయభ్రాంతులైపోయిన ఆ కుటుంబం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవాలని, అక్కడ తమ ఇంటిని సైతం అమ్మేసుకోవాలనీ భావిస్తోంది.