జమ్మూకశ్మీర్ లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన రాజ్‌నాథ్ సింగ్, ఉగ్రవాదులకు దీటైన బదులు ఇస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా కాన్పూర్ మీడియాలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.
గతంతో పోలిస్తే ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయన్న రాజ్‌నాథ్ సింగ్, మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అతి త్వరలోనే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయన్నారు.
తాజాగా అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో హల్కన్ గలి ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ప్రతిగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.
మరోవైపు శనివారం ఉదయం నుంచి శ్రీనగర్ లోని ఖాన్యార్ ప్రాంతంలో ముష్కరులు, ఆర్మీ మధ్య తుపాకుల మోత మోగుతోంది. ప్రస్తుతానికి రెండువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.