కరుడుగట్టిన నేరస్థుడు, సింగర్ సిద్దూ మూసేవాలతోపాటు, అనేక మంది ప్రముఖులను బెదిరించిన, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని అమెరికా నుంచి భారత్ రప్పించే ప్రయత్నం మొదలైంది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు ముంబై పోలీసులు నిర్థారించుకున్నారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అమెరికా పోలీసులను అలెర్ట్ చేశారు. సింగర్ సిద్దూ మూసేవాలతో హత్య కేసులో అన్మోల్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు పలుమార్లు చేసిన ప్రయత్నం వెనుక అన్మోల్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అక్కడ నుంచే నేర సామ్రాజ్యం నడుపుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు నటుడు సల్మాన్ ఖాన్‌కు తీవ్ర బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌పై హత్యా యత్నాలు విఫలమయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాల మేరకు సోదరుడు అన్మోల్ సుఫారీలు ఇచ్చి హత్యలకు గ్యాంగులను పంపిస్తున్నట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.
అన్మోల్ బిష్ణోయ్‌పై మోకా చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అన్మోల్ను ఉగ్రవాదుల లిస్టులో చేర్చిన ఎన్ఐఏ, పట్టించిన వారికి రూ.10 లక్షల పారితోషకం కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు అన్మోల్ కెనడాలో ఉన్నాడని భావించారు. అయితే అన్మోల్ అమెరికా చేరుకున్నట్లు తెలియగానే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. త్వరలో అతన్ని భారత్ తీసుకువచ్చే అవకాశముంది.