రాష్ట్ర రహదారులపై ఏర్పడిన గుంతలను సంక్రాంతి నాటికి పూడ్చి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం వద్ద ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం రోడ్లపై స్విమ్మింగ్ ఫూల్స్ ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. రహదారులు చక్కగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు.
విశాఖ రైల్వే జోన్కు భూములు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాబోయే కొద్ది రోజుల్లోనే జోన్కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో త్వరలో ఓ భారీ స్టీల్ ఫ్యాక్టరీ రాబోతోందని ఆయన ప్రకటించారు. మూలపేట పోర్టు సమీపంలో 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు కానీ, రుషికొండపై రూ.450 కోట్లతో జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నాడని విమర్శించారు. ఐదేళ్లు రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, రాబోయే ఐదేళ్లలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
విజయనగరం జిల్లా పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎం పర్యటన రద్దైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన కట్టడాలను సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు.