న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో శుభమన్ గిల్ సెంచరీ మిస్ అయ్యాడు. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 146 బంతులు ఆడి 90 పరుగులు చేశాడు. అజాజ్ పటేల్ బౌలింగ్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. శుభమన్ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి.
న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్ లో విధించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ అపసోపాలు పడుతున్న సమయంలో గిల్, పంత్ జోడి విలువైన షాట్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించారు. కివీస్ విధించిన తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని అధిగమించేందుకు పంత్, గిల్ జోడి ఆట దోహదపడింది. గిల్ 66 బంతుల్లో అర్థశతకం కొట్టగా .. పంత్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్, 59 బంతులు ఆడి 60 పరుగులు చేశాడు. ఈష్ సోధి వేసిన 37.3 బంతిని ఆడబోయి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు మళ్ళీ నెమ్మదించింది. ఆ తర్మాత వచ్చిన రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ కూడా విఫలమయ్యారు.
వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్, న్యూజీలాండ్ జట్టును తొలి రోజు నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసింది. రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలోభారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18), విరాట్ కోహ్లి(4) నిరాశపరిచారు. సిరాజ్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది.