ఉత్తరప్రదేశ్‌లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉపయెన్నికలు జరగనున్నాయి. వాటిలో సీసామవూ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున నసీం సోలంకీ అనే ముస్లిం మహిళ పోటీలో ఉంది. ఆమె దీపావళి సందర్భంగా ఒక దేవాలయాన్ని దర్శించింది. దాంతో ఆమెపై ఫత్వా జారీ అయింది.
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, ఎస్పీ అభ్యర్ధి నసీంకు ఫత్వా జారీ చేసాడు. షరియా చట్టం ప్రకారం నేరస్తురాలు కాబట్టి క్షమాభిక్ష అడగాలని, కొత్తగా కల్మా చదవాలనీ ఆదేశించాడు.
సలీం సోలంకి ఇటీవల వనఖండేశ్వర దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంది. అక్కడ శివలింగానికి అభిషేకం చేసి, దీపావళి వేడుకల్లో భాగంగా కొన్ని దీపాలు కూడా వెలిగించింది. ఆ వీడియోలను సమాజ్‌వాదీ పార్టీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసాయి. దాంతో ముస్లిం ఓటర్లలో ఆగ్రహం మిన్నంటింది. వారు ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చారు.
నసీం సోలంకి శివాలయ దర్శనం చేసుకోడాన్ని మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ తప్పుపట్టారు. ఇస్లాం నిబంధనల ప్రకారం విగ్రహారాధన నిషిద్ధం. ‘‘ఇస్లాంలో అల్లా ఒక్కరే ప్రార్ధించదగినవారు. పురుషుడు చేసినా లేక మహిళ చేసినా, విగ్రహాల పూజ చేయడం హరామ్, దానికి ఎలాంటి అనుమతీ లేదు’’ అని స్పష్టం చేసారు.
ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఏ రూపంలోనైనా విగ్రహారాధనలో పాల్గొనడం నేరం. ఆ పని చేసినవారు షరియా ప్రకారం శిక్షార్హులు. పైగా నసీం ఎవరి ఒత్తిడితోనూ ఆ పని చేయలేదు, సొంత నిర్ణయం ప్రకారమే గుడికి వెళ్ళింది, అక్కడి సంప్రదాయాలను ఇష్టపూర్తిగానే పాటించింది అని మౌలానా చెప్పారు.
తను చేసిన తప్పుకు నసీం పశ్చాత్తాపం ప్రకటించాలని షహాబుద్దీన్ చెప్పారు. ‘‘షరియా ప్రకారం ఆమె క్షమాపణ అడగాలి, ఇస్లాంలో తన విశ్వాసాన్ని మళ్ళీ నిర్ధారించడానికి కల్మా చదవాలి’’ అన్నారు.
ఎవరైనా ముస్లిం ఏదైనా ఒత్తిడి వల్లనో లేక పరిణామాలు అర్ధం కాకనో అటువంటి చర్యలకు పాల్పడితే ఇస్లామిక్ సూత్రాల ప్రకారం తీవ్రమైన శిక్షలు అవసరం లేదని, పశ్చాత్తాపపడితే సరిపోతుందనీ మౌలానా అన్నారు. ఇలాంటి సందర్భాల్లో తప్పు చేసిన వ్యక్తులు ప్రార్ధన ద్వారా క్షమాపణ కోరి, భవిష్యత్తులో అలాంటి చర్యలు చేయకుండా ఉండాలని వివరించారు. లేనిపక్షంలో అటువంటి చర్యలు ఇస్లాంపై వారి విశ్వాసాన్నీ, ఇస్లామిక్ బోధనలకు వారు ఏకీభవించడాన్నీ దెబ్బతీస్తాయని స్పష్టం చేసారు.
నసీం సోలంకీ, ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ భార్య. అతని పదవిపై అనర్హత వేటు పడినందున జరుగుతున్న ఉపయెన్నికల్లో అతని బదులు పోటీ చేస్తోంది. నామినేషన్ దాఖలు చేసాక ఎన్నికల ప్రచారం కోసం నసీం మతపరమైన పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ క్రమంలోనే స్థానికంగా ప్రఖ్యాతమైన వనఖండేశ్వర ఆలయాన్ని సందర్శించింది. దానితో వివాదం రాజుకుంది.