జమ్మూకశ్మీర్ లో బుల్లట్లె మోత మోగుతోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులతో శ్రీనగర్ లోని ఖాన్వారా ప్రాంతం దద్దరిల్లుతోంది.
ముష్కర మూక నక్కి ఉందనే సమాచారంతో ఖాన్వారాలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో తప్పించుకునేందుకు భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఎన్ కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రెండు వైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
జమ్మూకశ్మీర్ లోని బండిపోరా జిల్లా పరిధిలో ఇటీవల కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు ఎదురుపడ్డ తీవ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. నవంబర్ 1న ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో నక్కిన ముష్కరుల భరతం పట్టేందుకు చినార్ క్రాప్స్ రంగంలోకి దిగింది.
అఖ్నూర్ లో ఆర్మీ కాన్వాయ్ పై దాడికి తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులను అక్టోబర్ 29న భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వలస కార్మికులపై ముష్కరుల దాడులు ఇటీవల కాలంలో పెరిగాయి. బిహార్, యూపీ నుంచి వలస వచ్చిన కూలీలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. అక్టోబర్ 20న శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై గండేర్ బల్ జిల్లా పరిధిలో ఆరుగురు నిర్మాణ రంగ కూలీలను ముష్కరులు హత్య చేశారు.