రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైన 50ఏళ్ళ బ్యుటీషియన్ అనితా చౌధరి శవమై తేలడం నగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె శవాన్ని ఆరు ముక్కలు చేసి పూడ్చివేసినట్లు పోలీసులు కనుగొన్నారు. గులాముద్దీన్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో పూడ్చిన ఆ శరీరభాగాలను బైటకు తీసారు.
జోధ్‌పూర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న అనిత అక్టోబర్ 28 మధ్యాహ్నం దుకాణం మూసి వెళ్ళిన తర్వాత నుంచీ కనిపించడం లేదు. ఆటోలో బయల్దేరిన అనిత ఆ రాత్రి ఇంటికి చేరలేదు. దాంతో అనిత భర్త మన్మోహన్ చౌధరి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసుల విచారణలో అనితకు గులాముద్దీన్ అనే వ్యక్తితో వృత్తిగత పరిచయం ఉందని తెలిసింది. ఆమె బ్యూటీ పార్లర్ ఉన్న భవనంలోనే అతను టైలరింగ్ దుకాణం నడుపుతున్నాడు. అక్టోబర్ 28న అనిత ఎక్కిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారించగా, ఆమె గంగనా ప్రాంతంలో ఆటో దిగినట్లు తెలిసింది. ఆ ప్రాంతంలోనే గులాముద్దీన్ నివాసం ఉంది. మరోవైపు, ఆమె ఫోన్‌కాల్ రికార్డులను పరిశీలిస్తే చివరిసారి గులాముద్దీన్‌తోనే మాట్లాడినట్లు తేలింది.
గంగనా ప్రాంతంలోని గులాముద్దీన్ నివాసానికి చేరుకున్న పోలీసులకు అతని భార్య కనిపించింది. అనిత చనిపోయిన సంగతిని, ఆమె శరీరాన్ని తమ ఇంట్లోనే పూడ్చిపెట్టిన విషయాన్నీ తన భర్త చెప్పాడని ఆమె వెల్లడించింది. పోలీసులు ఆ ఇంటి పెరడును బుల్‌డోజర్‌తో 12అడుగుల లోతువరకూ తవ్వించారు. ఆ గోతిలో రెండు ప్లాస్టిక్ బ్యాగుల్లో అనిత శరీరభాగాలు ముక్కలుముక్కలుగా కనిపించాయి.
శరీర భాగాలన్నీ విడివిడిగా చుట్టి ఉన్నాయి. దాన్నిబట్టి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారని అర్ధమవుతోందని పోలీసులు చెప్పారు. ఆ శరీర భాగాలను పోస్ట్ మార్టం కోసం జోధ్‌పూర్ ఎయిమ్స్‌కు పంపించారు.
పోలీసుల సమాచారం ప్రకారం… గులాముద్దీన్ అనిత పీకను కత్తితో నరికి చంపేసాడు. తర్వాత కాళ్ళూ చేతులూ నరికేసాడు. మిగతా శరీరాన్ని కూడా ముక్కలు చేసాడు. ఆ ముక్కలను రెండు గోనెసంచుల్లో నింపాడు. వాటిని తమ ఇంటి పెరట్లో పాతిపెట్టేసాడు.
ఈ హత్యలో గులాముద్దీన్‌కు మరొకరు కూడా సహకరించారని అనిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనిత కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్ ప్రకారం, గులాముద్దీన్ అనితను ఏదో వంకతో తమ ఇంటికి పిలిచాడు, తర్వాత మోసపూరితంగా హత్య చేసాడు. అయితే శరీరాన్ని ఇన్నిముక్కలుగా కోసేటంత ఘాతుకం ఒక్కవ్యక్తి చేయలేడని వారు అనుమానిస్తున్నారు. అనిత చేతికి ఉండాల్సిన ఉంగరం గులాముద్దీన్ భార్య చేతికి ఉందని, హత్యలో ఆమె ప్రమేయం కూడా ఉండి ఉండవచ్చని అనిత భర్త మన్మోహన్ ఆరోపించాడు.
బాధితురాలి భర్త తన ఫిర్యాదులో గులాముద్దీన్‌తో పాటు ఆమె మాజీ వ్యాపార భాగస్వామి తయ్యబ్ అన్సారీ పేరు కూడా ప్రస్తావించాడు. ఆ ఫిర్యాదు ప్రకారం… అనిత తన దుకాణం తాళాలను పొరుగున ఉన్న అజీమ్‌కు ఇచ్చి బైటకు వెళ్ళింది. ఆ తర్వాత నుంచీ ఆమె కనిపించడం లేదు. అనిత మాయమైన కొద్దిసేపటి తర్వాత ఆమె తన సోదరి మీనాకు ఫోన్ చేసి మాట్లాడింది. తను తన స్నేహితురాలైన సునీత అలియాస్ సుమన్ దగ్గర ఉన్నట్లు చెప్పింది. మరికాసేపటికే అనిత ఫోన్ స్విచాఫ్ అవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తయ్యబ్ వల్ల అనితకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆమె భర్త మన్మోహన్‌కు గతంలోనే చెప్పానని సునీత పోలీసులకు వెల్లడించింది. అక్టోబర్ 29న మన్మోహన్‌ను కలిసినప్పుడు కూడా, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అయి ఉండవచ్చని అనిత సందేహం వ్యక్తం చేసింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గులాముద్దీన్‌కు జూదం ఆడే వ్యసనం ఉంది. దానివల్ల అతను అప్పుల్లో కూరుకుపోయాడు. అనితను కిడ్నాప్ చేసి ఆమె కుటుంబం నుంచి డబ్బులు గుంజేందుకు ప్రణాళిక వేసాడు. దాని ప్రకారమే అనితను నిర్బంధించాడు. అతనే ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం గులాముద్దీన్ అప్పులబాధ నుంచి బైటపడడానికి అనితను చంపేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది కుట్రపూరితంగా చేసిన హత్య అనీ, అందులో గులామ్ భార్య ప్రమేయం కూడా ఉందనీ అనుమానిస్తున్నారు.
పోలీసులు హత్య కేసు నమోదు చేసారు. పారిపోయిన గులాముద్దీన్ కోసం వెతుకుతున్నారు.