మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదయ్యాయి. మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖకు చెందిన కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ రూ.90 లక్షలు కాజేశాడని విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తాడేపల్లిలోని ఓ అపార్టుమెంటుకు తీసుకెళ్లి నాలుగుసార్లు అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రి నాగార్జున రమ్మంటున్నారంటూ ఆయన పీఏ మురళీధర్‌రెడ్డి ఓ అపార్టుమెంటు ప్లాటులోకి తీసుకెళ్లి బయట తాళం వేసి వెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే విశాఖ మన్యంలో స్లో పాయిజన్ ఇచ్చి ఓ టీచర్‌ను చంపేసినట్లు చంపేస్తామంటూ బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. తనపై దురుద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను అన్యాయం చేసి ఉంటే ఉరితీయండంటూ మీడియా ముందు వాపోయారు. తానే స్వయంగా జిల్లా ఎస్పీని కలసి ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వెలికితీయాలని కోరతానన్నారు. తనపై అక్రమ కేసు పెట్టిన వారిపై ప్రైవేటు కేసు వేస్తానని మాజీ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు.