అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 47సంవత్సరాల క్రితం ప్రయోగించిన వాయేజర్1 వ్యోమనౌక కొద్దిరోజుల క్రితం భూమితో కాంటాక్ట్ కోల్పోయింది. అయితే ఒకరోజు వ్యవధిలో మళ్ళీ కాంటాక్ట్‌లోకి రాగలిగింది. దానికి ఉపయోగపడిందొక రేడియో ట్రాన్స్‌మీటర్. విశేషం ఏంటంటే, ఆ ట్రాన్స్‌మీటర్ 1981 నుంచీ వాడుకలో లేదు.
వాయేజర్1 వ్యోమనౌకను నాసా 1977 సెప్టెంబర్‌లో ప్రయోగించింది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ ప్రస్తుతం భూమినుంచీ 15వందల కోట్ల మైళ్ళ దూరంలో అంతరిక్షంలో ఉంది. దాని ట్రాన్స్మిటర్స్లో ఒకటి 2024 అక్టోబర్ 16న ఆగిపోయింది. ఫలితంగా ఆ వ్యోమనౌకకు భూమితో సంబంధం తెగిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లో లోపం వల్ల ఆ సమస్య తలెత్తి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, అక్టోబర్ 24న మళ్ళీ భూమితో కాంటాక్ట్ అవడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు, వాయేజర్-1తో మళ్ళీ కాంటాక్ట్ అవగలిగారు.
వాయేజర్ 1 నుంచి భూమిమీదకు సంకేతం రావడానికి కనీసం 23గంటలు పడుతుందని నాసా చెబుతోంది. అక్టోబర్ 16న భూమి నుంచి నాసా ఇంజనీర్లు ఒక కమాండ్ పంపించారు. దానికి జవాబు అక్టోబర్ 18న వచ్చింది. ఆ మర్నాటి నుంచీ వాయేజర్1తో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది.
అసలేం జరిగిందంటే వాయేజర్1లో సాంకేతిక సమస్య కారణంగా ఆ వ్యోమనౌకలోని ఫాల్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, ట్రాన్స్మిటర్ను మార్చింది. స్టాండ్‌బైగా ఉంచిన లో పవర్ ఎస్-బ్యాండ్ ట్రాన్స్మిటర్ను వాడుకలోకి తెచ్చింది. ఫలితంగా నాసా కేంద్రంతో దాని కమ్యూనికేషన్ మళ్ళీ యథాతథంగా కొనసాగింది.
వాయేజర్1లో రెండు రేడియో ట్రాన్స్మిటర్లు ఉన్నాయి. వాటిలో ఎక్స్-బ్యాండ్ ట్రాన్స్మిటర్ను మాత్రమే మొదటి నుంచీ వాడుతున్నారు. రెండవదైన ఎస్-బ్యాండ్ ట్రాన్స్మిటర్ను 1981లో ఒకసారి ఉపయోగించారు. ఆ తర్వాత నుంచీ అది వాడకంలో లేదు. అంటే గత 47ఏళ్ళుగా దాదాపు నిద్రాణ స్థితిలోనే ఉందన్నమాట.
ఫాల్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏ కారణం వల్ల ట్రాన్స్మిటర్ను మార్చాల్సి వచ్చింది అనే విషయం కనుక్కోడానికి నాసా ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. దానికి కొన్నివారాల సమయం పడుతుంది. అంతవరకూ ట్రాన్స్మిటర్ను మార్చకుండా ఉండాలని నాసా నిర్ణయించుకుంది.
ఎస్ బ్యాండ్ ట్రాన్స్మిటర్ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని తేల్చడం కోసం అక్టోబర్ 22న నాసా ఇంజనీర్లు ఒక సందేశం పంపించారు. దానికి ప్రతిసందేశం అక్టోబర్ 24న భూమికి చేరింది. కాబట్టి ప్రధాన ట్రాన్స్మిటర్లో సమస్య తేలేవరకూ దీన్నే కొనసాగించనున్నారు.
ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రయోగించిన మొట్టమొదటి మానవనిర్మిత వ్యోమనౌక వాయేజర్1. నిజానికి దాన్ని వాయేజర్2 తర్వాతనే ప్రయోగించారు. కానీ ఈ నౌకే ముందుగా ఆస్టెరాయిడ్ బెల్ట్‌ను దాటివెళ్ళింది. అంతరిక్షంలో హీలియోస్పియర్ను దాటి వెళ్ళిన మొట్టమొదటి వ్యోమనౌక కూడా ఇదే. వాయేజర్1 గురుగ్రహం చుట్టూ ఉన్న ఒక పల్చని వలయాన్ని, దాని ఉపగ్రహాలైన థెబ్, మెటిస్లను కనుగొంది. ఆ తర్వాత, శనిగ్రహం చుట్టూ జి-రింగ్ అనే కొత్త వలయాన్ని, శని చుట్టూ తిరుగుతున్న ఐదు కొత్త చందమామలనూ కనుగొంది.