స్పెయిన్లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. సంవత్సరంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులోనే కురవడంతో వరదలు పోటెత్తాయి. తాజా వరదల్లో 205 మంది పౌరులు చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క వాలెన్సియాలోనే 202 మృతదేహాలను గుర్తించారు.
చరిత్రలో ఇలాంటి వరదలు ఎన్నడూ చూడలేదని స్పెయిన్ పౌరులు వాపోయారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం కూడా సాధ్యం కాలేదని వారు చెప్పారు. ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసిన పది నిమిషాల్లోనే నీరు ముంచెత్తిందని తెలిపారు.
స్పెయిన్ వరదల్లో పదుల సంఖ్యలో పట్టణాలు నేటినీ నీటిలో ముగిని ఉన్నాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
వేలాది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ధాటికి కార్లు గుట్టలుగా పేరుకుపోయాయి. వీధులు బురదమయంగా మారాయి. వాలంటీర్లు బురద తొలగించేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం లక్షలాది జనం ఎదురు చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో నేటికీ కరెంటు సరఫరా కావడం లేదు. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.