తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో కారును ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం కోదాడలో ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 30 మంది గాయపడ్డారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం ధర్మాపురం వద్ద ఓ కారు, ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కోదాడ వద్ద ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగూడెం వద్ద వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు, ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు,క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.