బంగ్లాదేశ్లో విద్యుత్ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. చాలాకాలంగా ఉన్న బకాయిలు చెల్లించనందున అదానీ పవర్ ఝార్ఖండ్ లిమిటెడ్ సంస్థ ఆ దేశానికి చేసే విద్యుత్ సరఫరాలో 50శాతం కంటె ఎక్కువ కోత విధించింది. ఈ కోత అక్టోబర్ 31నుంచి అమల్లోకి వచ్చింది.
పవర్ గ్రిడ్ బంగ్లాదేశ్ సమాచారం ప్రకారం ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తి 1496 మెగావాట్ల నుంచి 700 మెగావాట్లకు పడిపోయింది. దాంతో గురువారం నాటికి ఆ దేశపు విద్యుత్ అవసరంలో 1600 మెగావాట్లు కొరత పడింది.
అదానీ పవర్ ఝార్ఖండ్ లిమిటెడ్, తమకు బకాయి ఉన్న మొత్తాలను అక్టోబర్ 30నాటికల్లా చెల్లించాలంటూ బంగ్లాదేశ్ విద్యుత్ అభివృద్ధి బోర్డుకు గతంలోనే సమాచారం ఇచ్చింది. ఆ మేరకు బంగ్లాదేశ్ విద్యుత్ శాఖకు లేఖ కూడా పంపించింది.
‘‘బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ మాకు 170.03 మిలియన్ డాలర్లకు బంగ్లాదేశ్ కృషి బ్యాంక్ నుంచి లెటరాఫ్ క్రెడిట్ పంపలేదు, ఇప్పటికే బకాయి ఉన్న 846 మిలియన్ డాలర్లనూ చెల్లించలేదు’’ అని అదానీ సంస్థ వెల్లడించింది. చెల్లింపులు జరగని పక్షంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం తమకుందని గుర్తు చేసింది. బకాయిలు చెల్లించడానికి అక్టోబర్ 20 వరకూ ఉన్న గడువును మరో పది రోజులు పొడిగించింది. అక్టోబర్ 30 గడిచిపోయినా బంగ్లాదేశ్ బకాయిలు చెల్లించలేకపోయింది. దాంతో అదానీ పవర్ సంస్థ ఆ దేశానికి సరఫరా చేస్తున్న విద్యుత్తులో 50శాతానికి పైగా కోత విధించింది.