వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా దేశాలు తమ సైనిక దళాలను వెనక్కు తీసుకున్న తర్వాత, దెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల ‘సమన్వయ గస్తీ’ మొదలైంది. సమన్వయ గస్తీ అంటే రెండు వైపులా గస్తీ గురించి ఇరుదేశాలూ పరస్పరం సమాచారం పంచుకుంటాయి.
దెమ్‌చోక్ సెక్టార్‌లో గస్తీ తిరగడం ఇవాళ్టి నుంచి మొదలుపెట్టామని, దెప్సాంగ్ సెక్టార్‌లో కూడా మన గస్తీ త్వరలోనే మొదలవుతుందని భారత సైన్యం వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాల మోహరింపును వెనక్కి తీసుకోడానికి ఇరుదేశాలూ అంగీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
నిన్న గురువారం నాడు దీపావళి సందర్భంగా లద్దాఖ్ సెక్టార్‌లోని వివిధ సరిహద్దు పాయింట్ల దగ్గర ఇరుదేశాల సైనికులూ తీపిపదార్ధాలు ఇచ్చిపుచ్చుకున్నారు. హాట్ స్ప్రింగ్స్, కారకోరం కనుమ, దౌలత్ బేగ్ ఓల్డీ, కోంక్‌లా, చుషూల్-మోల్డో వంటి సరిహద్దు ప్రాంతాల దగ్గర సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.
ఈ పరిణామాలను లద్దాఖ్ ఎంపీ హాజీ హనీఫా స్వాగతించారు. ‘‘యుద్ధం ఎలా ఉంటుందో సరిహద్దుల దగ్గర నివసించే మాలాంటి వారికి బాగా తెలుసు. సరిహద్దుల వెంబడి శాంతిగా ఉండడమే మాకు కావాలి. రెండు దేశాల మధ్యా ఒప్పందం కుదరడాన్ని మేం స్వాగతిస్తున్నాం. సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు దౌత్య చర్చల ద్వారా పరిష్కారం కావాలి’’ అని ఆయన అన్నారు.
భారత సైనిక దళాధిపతి ఉపేంద్ర ద్వివేదీ ఈ అంశం గురించి మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ సరిహద్దుల వద్ద 2020 ఏప్రిల్ నాటి యథాతథ స్థితిని, పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం క్రమక్రమంగా జరుగుతుందని చెప్పారు. ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలను తొలగించడానికి… వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ అంగీకరించిన సరిహద్దుల దగ్గర బలగాలు వెనక్కి తగ్గడం, వాటి ఉపసంహరణ, బఫర్ జోన్ నిర్వహణ అనేవి కీలకమైన చర్యలని, అవి దశల వారీగా ఒకటొకటిగా అమలవుతాయనీ వెల్లడించారు.
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత చైనా సరిహద్దుల వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు 2020 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. చైనా సైన్యం హద్దులు దాటి భారత భూభాగం వైపు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో ఆ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల సంబంధాలనూ తీవ్రంగా ప్రభావితం చేసాయి.