దేశంలో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరాయి. అక్టోబరు మాసంలో 1658 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్పీసీఐ వెల్లడించింది. గత నెలలో 1500 కోట్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా అక్టోబరులో భారీగా పెరిగాయని తెలిపింది. చెల్లింపుల్లో గత ఏడాదితో పోల్చుకుంటే 45 శాతం వృద్ధి నమోదైంది.అక్టోబరులోనే రూ. 23.5 లక్షల కోట్లకు పైగా డిజిటల్ చెల్లింపులు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలు 34 కోట్లు, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు 45 కోట్లకు చేరాయి. దేశంలో యూపీఐ చెల్లింపులకు వినియోగదారులు ఆసక్తి చూపడంతో ఈ సేవలు అందించే బ్యాంకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది 492 బ్యాంకులు యూపీఐ సేవలు అందించగా, అది నేడు 622 బ్యాంకులకు పెరిగింది.
జీఎస్టీ వసూల్లు కూడా గణనీయంగా పెరిగాయి. సెప్టెంబరు నెలలో రూ.1.87 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. గత ఏడాది అక్టోబరులో 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో 8.9 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అక్టోబరులో దిగుమతులపై విధించిన పన్నుల వసూళ్లు రూ.45 వేల కోట్లకు చేరాయి.