వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.90 లక్షలు కాజేశాడంటూ విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజుకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇవ్వకపోగా, డబ్బు అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యక్తిగత సహాయకుడు మురళి, విశాఖలో గిరిజన ఉపాధ్యాయురాలికి విషం ఇచ్చి చంపినట్లు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె అభ్యర్థించారు.
మహిళ ఫిర్యాదుపై వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున స్పందించాల్సి ఉంది.మాజీ మంత్రి పీఏ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతన్ని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. మహిళపై బెదిరింపులకు దిగిన మురళీని అదుపులోకి తీసుకుని విచారించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.