తమ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో పథకం లబ్ధిదారురాలు శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్ళి ఉచిత గ్యాస్ సిలెండర్ అందించారు. ఆ సందర్భంగా చంద్రబాబు స్వయంగా టీ తయారుచేసి తాగారు. లబ్ధిదారురాలి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన మంత్రులు, కూటమి పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తమతమ నియోజకవర్గాల్లో ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం దీపం-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ పథకంలో ప్రతీ నాలుగు నెలలకూ ఒక సిలెండర్ చొప్పున ఏడాది కి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తుంది. ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొనే లబ్ధిదారులకు సిలెండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 48 గంటల్లో జమ చేస్తారు. ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉచిత గ్యాస్ రీఫిల్లింగ్ పొందేందుకు లబ్ధిదారులు 2025 మార్చి 31 వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని అధికారులు వెల్లడించారు.