బంగారం ధర దిగి వచ్చింది. గడచిన పది రోజుల్లోనే 10 గ్రాములకు రూ.5 వేలు పెరిగిన బంగారం నేడు రూ.770 తగ్గి, రూ.8100కు దిగివచ్చింది. గడచిన మూడు రోజుల్లోనే బంగారం ధర రూ. 1550 పెరగ్గా, నేడు దిగి వచ్చింది. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్లో లక్షా 6 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం పరుగు పెడుతూనే ఉంది. ఔన్సు గోల్డ్ 2761 అమెరికా డాలర్లకు పెరిగింది. ముడిచమురు ధరలు దిగి వచ్చాయి. బ్యారెల్ ముడిచమురు 74 డాలర్లకు తగ్గింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84 వద్ద ట్రేడవుతోంది.
బంగారం స్మగ్లింగ్ నిరోధించేందుకు కేంద్రం ఇటీవల దిగుమతి పన్నులను భారీగా తగ్గించింది. దీని ప్రభావం దిగుమతులపై చూపించింది. ఏటా భారత్ 830 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. అయితే గత నెల రోజే 235 టన్నుల బంగారం దిగుమతి అయింది. ఇది గత ఏడాది అక్టోబరుతో పోల్చుకుంటే 200 శాతం అధికం.
ప్రపంచ వ్యాప్తంగా నెలకు 450 టన్నుల బంగారం వినియోగిస్తున్నారు. ఇందులో 20 శాతం భారత్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ దిగుమతి చేసుకున్న బంగారంలో 30 శాతం ఆభరణాల రూపంలో ఎగుమతి చేస్తోంది. ప్రపంచంలో చైనా తరవాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.