భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో నివసిస్తుండడమే కాక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భూములు కబ్జా చేసారు. నర్మదా నది పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి ఓ చెరువును వ్యర్థపదార్ధాలతో పూడ్చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఈ విషయమై సుమారు 2వందల మందిని విచారించిన పోలీసులు, 51మందిని అరెస్ట్ చేసారు.
‘‘అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుల కోసం మా విభాగం కొన్ని నెలలుగా అన్వేషిస్తోంది. అలా గుర్తించినవారిలో కొందరిని బహిష్కరించాం. నేరాలకు పాల్పడినట్లు తేలినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. గతనెల మానవుల అక్రమ రవాణాకు చెందిన రెండు కేసులు వెలుగుచూసాయి. భారత పౌరుల్లా నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసాం. ఇలాంటి కేసులు పెరుగుతుండడంతో ఒక సమగ్ర తనిఖీ నిర్వహించాం. ఆ తనిఖీల్లో బైటపడిన 48 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. పత్రాలు తనిఖీ చేస్తే వారు బంగ్లాదేశ్ పౌరులని తేలింది. నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేసారని ఎఫ్ఐఆర్ నమోదైంది’’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ భరత్ పటేల్ చెప్పారు.
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, నాలుగు నెలల నిఘా తర్వాత 51మంది బంగ్లాదేశీ చొరబాటుదార్లను అదుపులోకి తీసుకుంది. అయితే అప్పటికే ఆ ప్రాంతంలోని బంగ్లాదేశీయుల్లో 60-70శాతం మంది అప్పటికే పారిపోయారని తెలిసింది. అరెస్ట్ అయినవాళ్ళలో అత్యధికులు తమను గుర్తించకూడదని హిందూ పేర్లు పెట్టుకున్నారని డిసిపి అజిత్ రాజీయన్ వెల్లడించారు.
ఉపగ్రహ ఛాయాచిత్రాలు చందోలా చెరువు దగ్గర చొరబాటుదారుల అక్రమ ఆక్రమణలను బహిర్గతం చేసాయి. చెరువుకు సరఫరా అయ్యే నర్మదా జలాలను చొరబాటుదారులు నిలిపివేసారు, దాంతో చెరువు ఎండిపోయింది. వారి ఆక్రమణలకు అడ్డులేకుండా పోయింది. క్రైమ్ బ్రాంచ్ తమ దర్యాప్తులో భాగంగా 1985, 2011, 2024 సంవత్సరాల నాటి శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించారు. దాని ఫలితంగా, చొరబాటుదారుల అక్రమ ఆక్రమణల విస్తృతి, చెత్తను డంపింగ్ చేయడం ద్వారా చెరువును కప్పిపెట్టేసిన వైనం నిర్ధారణ అయింది.
ఈమధ్యకాలంలో దేశవ్యాప్తంగా చేసిన అరెస్టుల ద్వారా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాట్లు, భారతీయ పత్రాల దుర్వినియోగం తీవ్రత బైటపడింది. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు ఉన్న 21మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. కర్ణాటక ఉడుపి జిల్లాలో 9మంది, త్రిపురలో 8మంది బంగ్లాదేశీయులను అదేవిధంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడడం, భారత్‌లో గుర్తింపు కార్డులు సంపాదించడం లేదా నకిలీ కార్డులు సృష్టించడం వంటి సంఘటనలు దేశ భద్రత గురించి ఆందోళన కలగజేస్తున్నాయి. సరిహద్దుల భద్రత, డాక్యుమెంట్ల తనిఖీలు వంటి చర్యలను మేనేజ్ చేస్తూండడం దేశ భద్రతకే సవాల్‌గా నిలిచింది. ఈ అనధికారిక, చట్టవిరుద్ధ చొరబాట్ల వల్ల వివిధ ప్రాంతాల్లోని జనాభాలో మార్పులు వస్తున్నాయి. ఆయా సమూహాల్లో ఇస్లామిస్ట్ అబ్రహామిక్ ప్రభావాలు విపరీతంగా పెరిగిపోతుండడం దేశ భవిష్యత్ స్థిరత్వానికి అదనపు ముప్పుగా పరిణమిస్తున్నాయి.