ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహామండలి అధ్యక్షుడు బిబేక్ దెబ్రాయ్ ఢిల్లీలోని స్వగృహంలో హఠాత్తుగా కన్నుమూశారు. 69 సంవత్సరాల బిబేక్ దెబ్రాయ్ ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. దెబ్రాయ్ ఆకస్మిక మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. దెబ్రాయ్తో తనకు అనేక సంవత్సరాలుగా అనుబంధముందని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆర్థిక విధానాలు దేశానికి ఎంతో మేలు చేశాయన్నారు.
దెబ్రాయ్ గతంలో నీతి ఆయోగ్ సభ్యుడిగా కూడా సేవలందించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన దెబ్రాయ్ అంచలంచలుగా ఎదిగారు. ప్రముఖ పత్రికలకు ఎడిటర్‌గా సేవలందించారు. నీతిఆయోగ్‌లో కీలక సలహాలు అందించారు.ప్రధాని ఆర్థిక మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దెబ్రాయ్ మృతికి పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.
బిబేక్ దెబ్రాయ్ సేవలకు కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. పుస్తకాలు రాయడం, చదవడం అంటే దెబ్రాయ్కు ఎంతో ఆసక్తి. ఆర్థికశాస్త్రం, చరిత్ర, పర్యావరణం, నాగరికత పుస్తకాలంటే ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అనేక పుస్తకాలు రచించారు. వార్తా పత్రికల్లో ఆయన రాసిన కథనాలు ప్రాచుర్యం పొందాయి.