పాత కక్షలకు ఓ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ప్రత్యర్థుల దాడిలో ఓ వ్యక్తితో పాటు ఆయన కుమారుడు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దీపావళి నాడు(గురువారం) కాకినాడలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాకినాడ పరిధిలోని కాజులూరు గ్రామంలో నెత్తురు మడుగులో చేతిలో కొడవళ్ళతో మూడు మృతదేహాలు పడిఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పాత కక్షలకు తోడు బాధిత కుటుంబం, నిందితులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
రెండు వర్గాల మధ్య విచక్షణా రహితంగా కత్తులతో పరస్పరం దాడి జరగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.హత్యకు గురైన వారు బత్తుల రమేష్, బత్తుల చిన్ని (కొడుకు), బత్తుల రాజు(మనవడు)గా పోలీసులు గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య చిరకాలంగా వైరం ఉన్నట్లు తేలిందన్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఘటనాస్థలికి వెళ్ళి కేసును విచారించారు.