మహారాష్ట్ర ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 8918 నామినేషన్లు దాఖలు కాగా 921 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బరిలో 7994 మంది నిలిచే అవకాశ మంది. నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండు రోజులు సమయం ఉండటంతో కొంత మంది నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది. అక్టోబరు 22న మొదలైన నామినేషన్ల ఘట్టం, 29న ముగిసింది. 30న నామినేషన్ల పత్రాల పరిశీలన పూర్తయ్యింది. నవంబరు 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
నవంబరు 20న ఒకే విడతలో ఎన్నిక జరగనుంది. నవంబరు 23న ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తం 9.7 కోట్ల ఓటర్లు ఉండగా వీరిలో తొలి సారి ఓటు నమోదు చేసుకున్న 2 శాతం మాత్రమే కావడం విశేషం. 5 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. శతాధిక వృద్ధులు 20వేలపైగా ఉన్నారు. 2019 ఎన్నికల నుంచి నేటికి 72 లక్షల ఓటర్లు పెరిగారు.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఈ మూడు పార్టీల కూటమి మహాయుతి అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ ( ఎస్పీ), శివసేనలోని యూబీటీ వర్గం కలసి పోటీ చేస్తున్నాయి. అధికారం నిలుపుకోవాలని అధికార కూటమి, ఎలాగైనా సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థులు పోరాడుతున్నారు.