అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దీపావళి సందేశంలో, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని హిందువులను దెబ్బతీసే మత వ్యతిరేక అజెండాలనుంచి వారిని కాపాడతానని, వారి స్వేచ్ఛ కోసం పోరాడతాననీ మాట ఇచ్చారు.
‘‘బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు అక్కడి హిందువులు, క్రైస్తవులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై పాల్పడుతున్న దుర్మార్గమైన హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేను అధికారంలో ఉండి ఉంటే అలాంటివి జరగనిచ్చేవాడిని కాదు’’ అని ట్రంప్, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాసుకొచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడుల విషయంలో ట్రంప్ స్పందించడం ఇదే మొదటిసారి. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి అయిన కమలా హారిస్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమల, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా సహా ప్రపంచమంతటా ఉన్న హిందువులను విస్మరించారని దుయ్యబట్టారు.
‘‘ఇజ్రాయెల్ లేదా ఉక్రెయిన్, అంతేనా, మన దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో వారి విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ మేము అమెరికాను మళ్ళీ బలోపేతం చేస్తాం. తద్వారా శాంతిని పునరుద్ధరిస్తాం’’ అన్నారు.
ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ భారత్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడు అని వ్యాఖ్యానించారు.
‘‘నేను అధికారంలోకి వచ్చాక భారతదేశంతోనూ, నా మంచి స్నేహితుడైన నరేంద్రమోదీతోనూ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ చెడు మీద మంచి విజయం సాధించేలా చేస్తుందని ఆశిస్తున్నాను’’ అని ట్రంప్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఈ యేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్ధుల ఉద్యమం ముసుగులో ప్రారంభమైన అరాచకం, హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంతో ఆగలేదు. ఆ వెంటనే హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసారు, హిందువుల దుకాణాలను వ్యాపారాలనూ నాశనం చేసారు. ఎంతోమంది హిందువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయెన్స్ లెక్కల ప్రకారం దేశంలోని 48 జిల్లాల్లో 200కు పైగా ప్రదేశాల్లో హిందువులపై దాడులు జరిగాయి. వందల మంది హిందువులను హత్య చేసారు.