భారతదేశపు ఉక్కుమనిషి అని పేరు పొందిన మహానుభావుడు, స్వతంత్ర సంగ్రామంలో వెన్నుచూపని వీరుడు, రాజకీయ దృఢసంకల్పంతో నాటి భారతదేశంలోని 565 రాజసంస్థానాలనూ పునర్వ్యవస్థీకరించి ఏకత్రితం చేసిన వాడు, దేశచరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన పరిస్థితుల్లో సమైక్య భారతాన్ని నిర్మించినవాడు సర్దార్ వల్లభ భాయి పటేల్.
సర్దార్ పటేల్ రాజకీయ నాయకుల జాతిలో అత్యంత అరుదైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఏ విషయాన్నయినా తర్కబద్ధంగా ఆలోచించడం, అందరి బాగు కోసం నిష్పాక్షికంగా పనిచేయడం, ఎలాంటి భయమూ లేకుండా వ్యవహరించడం ఆయన పద్ధతి. ఆయన హృదయంలో మానవతావాది, వ్యవహారంలో లౌకికవాది, ఆచరణలో దృఢంగా ఉండేవాడు. ఆయన రాజనీతిజ్ఞుడు, రాజకీయ దార్శనికుడు. ప్రస్తుత కాలంలోని చాలామంది రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన చాలా సరళంగా, ముక్కుసూటిగా ఉండేవాడు. రెండురకాల మాటలు మాట్లాడడం లేదా నాలుక మడతేయడం ఆయనకు తెలియదు. ఆయన ఏది అనుకునేవాడో అదే మాట్లాడేవాడు. లోపల ఒకటి, బైట ఒకటి మాట్లాడే రకం కాదు. భారత్ ఇవాళ సుస్థిరమైన సమాఖ్యరాజ్యంగా దంటే దానికి ఆయనే కారణం.
ఆయనను భారతదేశపు ఉక్కుమనిషి అంటారు, కానీ ఆయన దానికంటె చాలా ఎక్కువ. పటేల్ భారతదేశానికి లంగరు వేసినవాడు. భారత్ ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా విడిపోకుండా నిలువరించి మన దేశానికి బలమైన పునాది సృష్టించినవాడు. దానికి మొత్తం ఘనత ఆయన ఒక్కరికే చెందాలి. మన దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేయాలన్న బ్రిటిష్ వలస పాలకుల కుట్రను ఒంటిచేత్తో నిలువరించిన మహనీయుడు సర్దార్ పటేల్. నిజమైన జాతీయవాదిగా పటేల్ స్పష్టమైన చూపు, దృఢ సంకల్పం వలస పాలన అనంతర స్వతంత్ర దేశంగా భారత్కు పునాదులు వేసాయి. ఆయన ఈ దేశపు ప్రగాఢమైన మానవత్వ సంస్కృతిని బలంగా విశ్వసించి గుడ్డిగా అనుసరించిన వాడు. ఈ దేశపు ప్రత్యేక భౌగోళిక రాజకీయ గుర్తింపును పునరుద్ధరించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఆయనకు జోహార్లు.