వర్తమాన భారతదేశం తన సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనైనా రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. మన సైనికుల పట్టుదలను దేశ ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పారు.
‘‘ఇవాళ మన దేశం సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ పడబోదు. అందుకే, మనవిధానాలను మన సైనిక బలగాల నిర్ణయాలకు అనుగుణంగా ఉండేలా చేసాం. మనకు మన సైనికుల పట్టుదలపై పూర్తి నమ్మకం ఉంది, మన శత్రువుల మాటల మీద కాదు’’ అని మోదీ చెప్పారు. ఆయన గుజరాత్‌లోని కఛ్ వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
‘‘మాతృభూమికి సేవ చేయగలగడం గొప్ప అవకాశం. మీ కృతనిశ్చయాన్ని, దృఢసంకల్పాన్నీ, అచంచల ధైర్యాన్ని, అసమాన సాహసాన్ని చూసినప్పుడు మన ప్రజలు మన దేశం సురక్షితంగా, ప్రశాంతంగా ఉందని భావిస్తున్నారు. ప్రపంచదేశాల ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు భారతదేశం శక్తిని చూస్తున్నారు. శత్రువులు మిమ్మల్ని చూసినప్పుడు వారి దుర్మార్గపు ప్రణాళికల అంతాన్ని చూస్తున్నారు. మీరు చేసే సింహగర్జనలు విని ఉగ్రవాద నేతలు సైతం భయంతో గజగజ వణికిపోతారు’’ అంటూ మోదీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్ ఇవాళ దేశీయంగా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడం ద్వారా ఆత్మనిర్భర భారతంపై ప్రజల్లో సానుకూల విశ్వాసం కలిగిందని వివరించారు. ‘‘ఇవాళ భారత్ తన సొంత జలాంతర్గామిని నిర్మించుకుంటోంది. ఇవాళ మన తేజస్ ఫైటర్ ప్లేన్ మన వైమానిక దళానికి బలంగా నిలుస్తోంది. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా మాత్రమే తెలుసు. ఇవాళ భారతదేశం రక్షణరంగ పరికరాలను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తోంది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
‘‘21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మనం మన సైన్యాలను, మన రక్షణ బలగాలను ఆధునిక ఆయుధ సంపత్తితో సన్నద్ధం చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యాధునిక సైనిక బలగాల సరసన మన సైన్యాన్ని కూడా నిలబెడుతున్నాం. మా ఈ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో మనం సాధిస్తున్న స్వయంసమృద్ధే’’ అని ప్రధాని వివరించారు.
దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం భద్రతాబలగాలు చేస్తున్న కఠోర శ్రమను, త్యాగాలనూ ప్రధాని ప్రశంసించారు. ‘‘మన దేశం ఒక సజీవ చైతన్యం. దాన్ని మనం భారతమాత అని పూజిస్తాం. మన సైనికుల కఠోర పరిశ్రమ, త్యాగాల కారణంగానే మన దేశం, మన ప్రజలు ఇవాళ సురక్షితంగా ఉన్నారు. సురక్షితమైన దేశం మాత్రమే పురోగతి సాధించగలదు. ఇవాళ మనం వికసిత భారతం దిశగా వడివడిగా ప్రయాణిస్తున్నాం. మీరంతా ఆ స్వప్నాన్ని రక్షిస్తున్నారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘ఇవాళ మన దేశ ప్రజలందరూ దేశాభివృద్ధి కోసం తమవంతు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం వారికి మీమీద పూర్తి విశ్వాసం ఉండడమే. భారతీయుల నమ్మకాన్ని మీ ధైర్యసాహసాలు మరింత బలపరుస్తూనే కొనసాగుతాయని నా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు మోదీ.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ గుజరాత్ కఛ్ ప్రాంతంలోని సర్‌క్రీక్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి, జాతీయ ఐక్యతా దినం సందర్భంగా కేవడియాలోని ఐక్యతా ప్రతిమ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. వైమానిక దళం నిర్వహించిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం నిర్వహించిన ఎయిర్‌షోకు హాజరయ్యారు.