ద్రవిడవాదం పేరిట దేశవ్యతిరేక, హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న డిఎంకె పరిపాలనలో తమిళనాడు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. దేశరక్షణ విషయంలో సైతం డిఎంకె ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దానికి తాజా ఉదాహరణ, ఒక శివాలయం దగ్గర రాకెట్ లాంచర్ లభించడమే.
తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గర అండనల్లూరులోని ఒక శివాలయం దగ్గర ఒక రాకెట్ లాంచర్ కనిపించింది. తొలుత దాన్ని గమనించిన భక్తులు మొదట అదేదో బాంబు అయుంటుందని అనుకున్నారు. పోలీసులకు అదే విషయాన్ని వెల్లడించారు. దాంతో గుడికి వెళ్ళిన పోలీసులు ఆ రాకెట్ లాంచర్‌ను అక్కణ్ణుంచి తీసుకుపోయారు. ఈ వ్యవహారం గురించి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, ఆ రాకెట్ లాంచర్ ఎక్కడిదనే విషయాన్ని తెలుసుకోడానికి నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అసలు అలాంటి ప్రమాదకర ఆయుధాలు దేశంలోకి, రాష్ట్రంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయన్న విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. అయితే క్రైస్తవ మతమార్పిడులు, తమిళఈలం రాజకీయాలు, ఎల్‌టిటిఇ వంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం అందించే తమిళనాడులో ఈ విషయం పెద్ద వార్త కాకపోవడం ఆందోళనకరం.
తమిళనాడులో నేరస్తుల నెట్వర్క్ గురించి కేంద్రప్రభుత్వ నిఘాసంస్థలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రాష్ట్రంలో ఎల్‌టిటిఇ మళ్ళీ పునరుజ్జీవనానికి ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తూ వచ్చాయి. శ్రీలంక నుంచి జలమార్గం ద్వారా పలువురు తమిళనాడులో చొరబడుతున్నారనీ, వారు మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్నారనీ కూడా కేంద్రం హెచ్చరించింది. అయినా డిఎంకె సర్కారు స్పందించలేదు. శ్రీలంక నుంచి వచ్చేవారు తమిళనాడులోని కోడికర్రయ్ రేవును ల్యాండింగ్ పాయింట్‌గా చాలానాళ్ళుగా వాడుతున్నారని కూడా కేంద్రం సమాచారమిచ్చింది. అదే రేవు నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలు రాష్ట్రంలోకి వస్తున్నాయని, అక్కణ్ణుంచీ కేరళకు స్మగుల్ అవుతున్నాయనీ, అక్కడ నక్సలైట్లకు అందుతున్నాయనీ కేంద్రం తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది.
అన్నిటికంటె ఆందోళనకరమైన విషయం… పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక మాడ్యూల్ ఏర్పాటు చేసుకుంది. అక్కణ్ణుంచి తమిళనాడులోకి ఉగ్రవాదులను పంపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. దాని ప్రణాళిక తమిళనాడుకే పరిమితం కాలేదు. మొత్తం దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో తన మాడ్యూల్స్ ఏర్పాటు చేయడానికి కుట్రలు పన్నుతోంది. అలా శ్రీలంక నుంచి చొరబడి తమిళనాడును ద్వారంగా వాడుకుని దక్షిణ భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలన్నది పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రగా ఉంది.
తమిళనాట ఆయుధాలు, పేలుడు పదార్ధాల సమస్య:
తిరుచిరాపల్లిలో రాకెట్ లాంచర్లు దొరకడాన్ని ఒక విడి కేసుగా మాత్రం చూడకూడదు. రాకెట్ లాంచర్లు సాధారణ ఆయుధాలు కావు, వాటిని యుద్ధాల్లో ఉపయోగిస్తారు. అలాంటి ఆయుధాలను సమకూర్చుకోగల సామర్థ్యం ఉన్న సంస్థ ఎల్‌టిటిఇ. ఆ సంస్థ లేదా దానినుంచి ప్రేరణ పొందిన మాడ్యూళ్ళు తమిళనాట ఇప్పటికే ఉన్నాయి.
2022లో ఒక ఎల్‌టిటిఇ ప్రేరిత ఉగ్రవాద మాడ్యూల్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలు పట్టుబడిన కేసుకు సంబంధించి, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ ఈ యేడాది ఫిబ్రవరిలో చెన్నై, తిరుచిరాపల్లి, శివగంగ, తెన్కాశి సహా ఆరు ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఏడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఎనిమిది సిమ్ కార్డులు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, పలు డాక్యుమెంట్లు జప్తు చేసారు. ఎల్‌టిటిఇ నుంచి ప్రేరణ పొందిన ఇద్దరు వ్యక్తులు అటువంటి సంస్థను ఏర్పాటు చేసి తమిళనాడు రాష్ట్రంపై సాయుధ పోరాటం చేయాలని ప్రయత్నించారన్న సంగతి ఆ దర్యాప్తులోనే వెల్లడైంది.
ఎల్‌టిటిఇ పునరుద్ధరణ ప్రయత్నాలు:
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) పునరుజ్జీవం చెందడానికి అన్నిరకాలుగానూ ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ బ్యూరో నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. అలాంటి వేళ, రాకెట్ లాంచర్లు దొరుకుతుండడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం.
గతేడాది ఎన్ఐఎ చెన్నైలో నిర్వహించిన సోదాల్లో భారీమొత్తంలో నగదు, బంగారు కడ్డీలు, డిజిటల్ పరికరాలు, మాదకద్రవ్యాలు, పలు డాక్యుమెంట్లను జప్తు చేసింది. ఆ సోదాలు చేసిన ఇళ్ళు, వ్యాపార సంస్థలు ఎనిమిది మంది అనుమానితులవి అని ఎన్ఐఎ వెల్లడించింది. ఎల్‌టిటిఇని పునరుద్ధరించడమే లక్ష్యంగా వారు భారత్-శ్రీలంక మధ్య ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్నారని స్పష్టం చేసింది. అలాంటి అక్రమ కార్యక్రమాల ద్వారా భారీమొత్తంలో డబ్బులు సంపాదించడమే కాక తమ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతినీ బైటపెట్టింది. ఎల్‌టిటిఇ పునరుద్ధరణ ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరిస్తూ వారు వెబినార్లు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా జరుగుతున్న అలాంటి వెబినార్లకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు సహాయం అందిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఎల్‌టిటిఇ సంస్థకు ఇప్పటికీ పలు బినామీ ఖాతాల్లో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయని సమాచారం. ఆ డబ్బులను బైటకు తీయడానికి ఈమధ్య కొన్ని ప్రయత్నాలు జరిగాయని నిఘా సంస్థలు కనుగొన్నాయి. మచ్చుకి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ముంబై ఫోర్ట్ బ్రాంచ్‌లో జరిగిన అలాంటి లావాదేవీ ఒకదాన్ని గుర్తించారు. ఆ ఖాతా నుంచి నగదు తీసారు. ఎల్‌టిటిఇ పునరుద్ధరణకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంతమందికి ఆ డబ్బు పంచడానికి ప్రయత్నాలు జరిగాయి.
కొంతమంది ఎల్‌టిటిఇ సభ్యులు పాకిస్తాన్‌తోనూ సంబంధాలు నెరపుతున్నారని నిఘాసంస్థల దృష్టికి వచ్చింది. ఈమధ్య శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు, ఆ దేశంలో అశాంతి నెలకొన్న సమయంలో ఈ కార్యకలాపాలు బాగా పుంజుకున్నాయని భారత నిఘావర్గాల పరిశీలనలో తేలింది.
దేశభద్రతకు సంబంధించి ఇంత తీవ్రమైన సమస్య విషయంలో రాష్ట్రప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరించడం ఆందోళనకరం. వారు దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయకుండా, కేంద్రప్రభుత్వ సంస్థలతో సరిగ్గా సమన్వయం చేసుకుంటూ తమిళనాడు సురక్ష గురించి ప్రయత్నించడం అత్యంత అవసరం.