తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక నిర్వహించారు.
అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ ఆస్థానంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివీఎస్‌వో శ్రీధర్, డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, పారు పత్తేదార్ బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.