భారత సైన్యం అన్ని మతాల కలయిక. యూనిట్ స్థాయిలో, రెజిమెంట్ స్థాయిలో భారత సైన్యంలో సర్వమతాల వారూ ఐకమత్యంగా పనిచేస్తారు. నియంత్రణ రేఖ దగ్గర, వాస్తవాధీన రేఖ వద్ద, సముద్రగర్భ ద్వీపాల్లో… అలా భారత సైన్యం పనిచేయని చోటంటూ లేదు. భారత సైన్యం అన్ని పండుగలూ చేసుకున్నా, వారు దీపావళి పండుగ చేసుకునే ప్రత్యేకతే విశేషం.
దీపావళి ప్రధానంగా విజయాన్ని వేడుకగా నిర్వహించుకునే పండుగ. రావణాసురుణ్ణి జయించిన రాముడు అయోధ్యకు విజయవంతంగా చేరుకున్న సందర్భంగా జరుపుకునే పండుగ. ఒక సైన్యం గొప్పది అనడానికి శత్రువు మీద సాధించే విజయమే అతి గొప్ప ప్రమాణం. అందుకే, పాల్గొన్న ప్రతీ యుద్ధంలోనూ విజయమే సాధించిన భారత సైన్యానికి దీపావళిని మించిన పండుగ లేదు. ఎందుకంటే, భారత అధికారులు తమ సైనికులను సర్వదా యుద్ధానికి సన్నద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. ప్రత్యేకించి, దీపావళి పండుగకు ముందు వారు కఠోరమైన శిక్షణ పొందుతారు, కఠినమైన అభ్యాసం చేస్తారు.
భారత సైన్యం మోహరించి ఉండే రణక్షేత్రాలు అన్నీ భౌగోళికంగా విభిన్నమైన ప్రాంతాలు. కొన్ని సరిహద్దుల్లో ఉంటే, మరికొన్ని కొండప్రాంతాలు. మైదానాలు, పర్వతాలు, అడవులు, దీవులు… ఇలా భారత సైన్యం నిఘా ఉండని చోటే లేదు. అలాంటి ‘ఫీల్డ్ స్టేషన్స్’లో సైనికులు కుటుంబాలకు దూరంగా, ఒంటరిగా, ఏ క్షణంలో యుద్ధం వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు. మిగతా సైన్యం ‘పీస్ స్టేషన్స్’లో అంటే కంటోన్మెంట్ ఏరియాలు, మిలటరీ స్టేషన్స్‌లో ఉంటారు. వారు యుద్ధం కోసం శిక్షణ పొందుతూ ఉంటారు. ఆయుధాలు, మందుగుండు, పరికరాలు, వాహనాల వంటి సదుపాయాలను నిరంతరం పరీక్షిస్తూ యుద్ధానికి సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
దీపావళి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరుపుకొంటారు. అంటే దాదాపు పది నెలల కఠోర శిక్షణతో భారత సైన్య యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో సియాచిన్ గ్లేసియర్ లాంటి అతిశీతల ప్రదేశాల్లో, చెన్నైలాంటి మెట్రో నగరాల్లోనూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఫీల్డ్ స్టేషన్స్‌లోని సైనికులు తమ బంకర్లు, బురుజుల వంటి నిర్మాణాలను శుభ్రం చేసుకుంటారు. పీస్ స్టేషన్లలోని సైనికులు తమ నివాస ప్రాంతాలు, ఆస్పత్రులు, వాహనాగారాలను శుభ్రం చేసుకుంటారు. పీస్ స్టేషన్స్‌లో దీపావళికి వారం ముందు ఒక మేళా నిర్వహిస్తారు. ఆరోజు యూనిట్ల వారీగా దీపావళి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వాటిలో దీపాలు, కొవ్వొత్తులు, అలంకరణ సామగ్రి, తినుబండారాలూ అన్నీ ఉంటాయి. అన్నిమతాల సైనికులూ ఆ మేళాలో సరదాగా పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం సైనికులు, వారి కుటుంబాలూ అందరూ కలిసి బాణాసంచా కాల్చే కార్యక్రమంలో పాల్గొంటారు.
భారత సైన్యంలో జరిగే వేడుకల్లో సాధారణ సైనికులతో కలిసి అధికారులు సైతం పాల్గొంటారు. దీపావళి రోజు సీనియర్ అధికారులు చిన్నచిన్న మిలటరీ పోస్ట్‌లను ప్రత్యేకంగా సందర్శించి అక్కడి సైనికులకు మిఠాయిలు పంచిపెడతారు. వారితో కలిసి కుటుంబంలా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. సరిహద్దుల్లోని పోస్ట్‌ల వద్ద ఉండే సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం అనే అందమైన సంప్రదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో ప్రారంభించారు. ఈ యేడాది రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాల అధిపతులూ దీపావళిని ఫార్వర్డ్ లొకేషన్స్‌లో జరుపుకొంటారు.
దీపావళి అందం ఏంటంటే అది సైనికులు అందరినీ ఏకం చేస్తుంది, వారి పటిష్టమైన పోరాటపటిమ వారిని ఒకేచోటకు చేరుస్తుంది. కఠోరమైన సైనిక జీవితంలో దీపావళి పండుగ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నిత్యం సమర సన్నద్ధంగా ఉండే సైనికుల ముఖాలపై చిరునవ్వులు తీసుకొస్తుంది. ఒక రెజిమెంట్ లేదా ఒక బెటాలియన్ మొత్తం ఒకటే కుటుంబంగా మారిపోతుంది. దేశం ఎదుర్కొనే అంతర్గత, బహిర్గత సవాళ్ళపై పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ యేడాది తూర్పు లద్దాఖ్ నుంచి చైనా దళాలు ఉపసంహరించుకునేలా చేయడంలో విజయం సాధించడం మన సైన్యం మన దేశానికి ఇచ్చిన గొప్ప దీపావళి కానుక. జైహింద్.. జై భారత్…!