ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చింది. ఎన్నికల హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో అందజేయనుంది.
సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆలయాల పరిధిలోని 600 మంది వేద పండితులకు మేలు జరగనుంది.
ఆలయాల పాలకమండలిలోనూ బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు దేవాదాయ చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. అలాగే పూజారులు, నాయిబ్రాహ్మణుల వేతనాన్ని కూడా ఏపీ ఎన్డీయే ప్రభుత్వం పెంచింది.