అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తరవాత జరుపుకున్న మొదటి దీపావళి రోజు రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. సరయూ నదీ తీరంలోని 55 ఘాట్లలో ఒకేసారి 2512585 దీపాలను వెలిగించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ఇక 1121 మంది ఒకేసారి హారతి ప్రదర్శించి మరో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు రికార్డులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వయంగా పాల్గొన్నారు.
సరయూ తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హెలికాఫ్టర్ల నుంచి పుష్పక విమానం ఆకారంలో కొందరు చేసిన సాహస క్రీడ ఆకట్టుకుంది. వారందరినీ ఓ రథంపై ఎక్కించి సీఎం యోగి సహా పలువురు లాగారు. డ్రోన్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన కళాకారులు వారి ప్రదర్శనలు ఇచ్చారు. లక్షలాది భక్తులు ప్రదర్శనలు తిలకించారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తరవాత బుధవారం నాడు జరుపుకున్న దీపావళిని ఎంతో ఘనంగా నిర్వహించారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. సరయూ తీరం దీపకాంతుతో విరాజిల్లింది. పలువురు ప్రముఖులు బాలరాముడిని దర్శించుకున్నారు. సరయూ తీరంతోపాటు, అయోధ్య నగరంలో అనేక చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.