అయోధ్య, పరిసర ప్రాంతాల్లోని కోతులకు ఆహారం అందించడం కోసం హిందీ సినీనటుడు అక్షయ్‌కుమార్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఆ ప్రాంతంలో వానరాలు విహరించే కొన్ని ప్రదేశాలను ‘సేఫ్ స్పాట్స్’గా గుర్తించారు. అక్కడ వాటికి ఆహారం అందిస్తారు.
అయోధ్యలో ఆంజనేయ సేవా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి నడుస్తోంది. జగద్గురు స్వామి రాఘవాచార్యజీ మహరాజ్ అనే స్వామీజీ మార్గదర్శనంలో ఆ సంస్థ అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కోతులకు ఆహారం అందించే సేవ చేస్తోంది. అక్షయ్‌కుమార్ ఆ స్వచ్ఛంద సంస్థకే విరాళం అందజేసారు.
అక్షయ్‌కుమార్ తన తల్లిదండ్రులతో పాటు తన మామగారైన దివంగత నటుడు రాజేష్ ఖన్నా పేరిట ఆర్థిక సహాయం అందించారు. దాంతో ఆ సంస్థ వారి పేర్లను, కోతులకు ఆహారం అందించడం కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిన వ్యాన్ పైన ముద్రించింది.
అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లో 1200కు పైగా కోతులున్నాయని ఒక అంచనా. రాముడు సీతమ్మను రక్షించుకోడానికి చేసిన యుద్ధం కోసం నిర్మించుకున్నది వానరసేననే. పైగా, అపర రామభక్తుడైన హనుమంతుడు ఆ వానర పరివారంలోనివాడే. అందుకే రాముడి జన్మభూమిలో వానరాలకు ఆదరణ ఎక్కువ. స్థానిక ప్రజలకు, అయోధ్య వచ్చే భక్తులకూ కోతుల వల్ల ఇబ్బంది కలగకుండా, వాటికి ప్రతీరోజూ పోషకాహారాన్ని అందించాలనే సంకల్పంతో ఆంజనేయ సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.