గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు, క్రిమినల్ ముఠా బంబిహా నాయకుడు కుట్ర చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. తన గ్యాంగ్ పలుకుబడిని పెంచుకునేందుకు బిష్ణోయ్‌ను అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.
బంబిహా ముఠా నాయకుడు కుశాల్ చౌధ్రీ తన అనుచరుడు పవన్ షూకీన్ అలియాస్ సోనూతో కలిసి కుట్ర పన్నినట్లు జాతీయమీడియాలో వార్తలొచ్చాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న పవన్, ఇద్దరు షూటర్లను పురమాయించాడని, అక్టోబర్ 26న దిల్లీ రాణీబాగ్లోని ఓ వ్యాపారవేత్త ఇంటివద్ద రెక్కీ నిర్వహించి కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త నుంచి రూ.15 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారని, లేకపోతే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారట. అయితే ఈ లోపే పోలీసులు ఆ ఇద్దరు షూటర్లను అరెస్టు చేశారు.
వీరిని విచారించగా, లారెన్స్‌ను చంపేందుకు దిల్లీ జైల్లో ఉన్న కుశాల్ చౌధ్రీ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిలోభాగంగా డబ్బులు సమీకరించేందుకే ఆ వ్యాపారవేత్తను బెదిరించారు. కుశాల్‌ను 2019లో థాయ్‌ల్యాండ్‌లో అరెస్టు చేసి ఆ తర్వాత భారత్ కు తీసుకొచ్చారు. ఎన్ఐఏ అతడి స్థావరాలపై వరుసగా దాడులు చేసి కేసులు నమోదు చేసింది. గాయకుడు సిద్ధూమూసేవాల హత్యకు ప్రతీకారంగా లారెన్స్ చంపుతానని అతడు 2022లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
గతేడాది పోలీస్‌కస్టడీలో ఇతడు ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు లారెన్స్ కూడా కుశాల్‌ను అంతం చేయాలని చూస్తున్నాడు. ఇటీవల సబర్మతి జైల్లో అతడిని ఎన్ఐఏ ప్రశ్నించగా.. తన హిట్ లిస్ట్‌లో బంబిహా గ్యాంగ్ నాయకుడు ఉన్నట్లు చెప్పినట్లు తెలిసింది.
మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.