అభిమాని రేణుకాస్వామి హత్యకేసు విచారణలో భాగంగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు ఆరువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
సర్జరీ కోసం బెయిలు మంజూరు చేయాలంటూ దర్శన్ పెట్టుకున్న పిటిషన్పై వాదనలు ముగియడంతో నిన్న తీర్పును ధర్మాసనం రిజర్వు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అభిమాని హత్య కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. సహనటి పవిత్రగౌడకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడంతో ఆగ్రహించిన దర్శన్ అతడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కరెంట్ షాక్, గాయాల కారణంగా రక్తస్రావంతో మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టు లో వెల్లడైంది. ఈ కేసులో పవిత్రగౌడ ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.