భారత పర్యటనలో ఉన్న స్పెయిన్ ప్రధానమంత్రి పెద్రో సాంచెజ్, యూపీఐ పద్ధతిని ఉపయోగించి గణేశ ప్రతిమను కొనుగోలు చేసారు. భారతదేశపు డిజిటల్ చెల్లింపుల విధానానికి పెరుగుతున్న ఆదరణకు, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకూ ఈ చర్య ప్రతీకగా నిలిచింది. పెద్రో సాంచెజ్ మంగళవారం సాయంత్రం ముంబైలో ఈ డిజిటల్ కొనుగోలు చేసారు.
యుపిఐ పద్ధతిలో మొబైల్ ఫోన్లు, పిఒఎస్ టెర్మినల్స్ లేదా కంప్యూటర్ల ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బులు చెల్లించవచ్చు. 2023లో ప్రపంచంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46శాతం భారత్‌లోనే జరిగాయి. వాటిలో 80శాతం చెల్లింపులు యుపిఐ పద్ధతిలో జరిగినవే. దేశమంతటా 2023లో జరిగిన డిజిటల్ లావాదేవీలు వంద బిలియన్లకు పైమాటే.
సాంచెజ్, ఆయన భార్య బెగోనా గోమెజ్ల గౌరవార్థం మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గతరాత్రి రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. ఇరుదేశాల మధ్యా సాంస్కృతిక బంధాలు మరింత బలపడాలని రెండు దేశాలూ పిలుపునిచ్చాయి. ఆ సందర్భంలో, రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి స్పానిష్ అనువాదాన్ని తను చదివానని సాంచెజ్ చెప్పడం విశేషం. భారతదేశానికి ఫుట్‌బాల్ కోచ్‌లను పంపిస్తామని, అలాగే తమ దేశంలో భారత్ క్రికెట్‌ను ప్రోత్సహించవచ్చనీ ఆయన చెప్పుకొచ్చారు.